మద్దిలపాలెం: సంక్షోభాల నుంచి పరిష్కారాలను అన్వేషించాలని, వాటినే అవకాశాలుగా మలుచుకుంటూ యువతరం ముందుకు సాగాలని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల వారోత్సవాల్లో భాగంగా ఏయూ ఇంజినీరింగ్, మహిళా ఇంజినీరింగ్ కళాశాలలు సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి వేడుకలను బుధవారం ముఖ్య అతిథిగా ఆయన ప్రారంభించి మాట్లాడారు. నషాముక్త్ క్యాంపస్‌లుగా విశ్వవిద్యాలయాలు నిలవాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా యువతలో చైతన్యం నింపాలని సూచించారు. విశ్వవిద్యాలయం నిరంతర ప్రగతి సాధించడం, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ఎంతో ప్రధానమన్నారు. ముఖ్యంగా భారత్‌కు క్రూడ్ ఆయిల్, రక్షణ రంగ ఆయుధాలు, వంటనూనెలు అధికంగా దిగుమతవుతున్నాయని, వీటిని తగ్గించుకోవడం ద్వారా దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. తాను రాజకీయ ఓనమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నానని, నేడు తానున్న స్థితికి ఏయూనే కారణమని తెలిపారు. వందేళ్ల ఏయూ ప్రయాణాన్ని పరిశీలిస్తే జ్ఞానం, నైతిక విలువలు, సేవ అనే మూడు సూత్రాలపై సాగిందని స్పష్టమవుతోందన్నారు.
బోధన వసతులు బలోపేతం చేస్తాం
ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య కె.మధుమూర్తి మాట్లాడుతూ విలువలతో ఎదగడం, సమాజానికి ఉపయుక్తంగా నిలవడం ఏయూను చూస్తే అర్థమవుతుందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధన వసతులను బలోపేతం చేస్తామని, త్వరలో నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎన్‌టీయూ ప్రెసిడెంట్స్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఉపద్రష్ట రామమూర్తి మాట్లాడుతూ తాను ఏయూలో చదువుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. పూర్వ విద్యార్థుల ప్రగతి విశ్వవిద్యాలయానికి స్ఫూర్తిని, ఖ్యాతిని అందిస్తాయన్నారు. విశ్వవిద్యాలయం తరఫున అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, ఆచార్య ఎన్.చిట్టిబాబు, ఆచార్య డి.లలిత భాస్కరి, ఆచార్య బి.ప్రజ్ఞ, ఆచార్య పి.స్వప్న తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.


