ఆధునిక హంగులతో అయ్యప్పస్వామి ఆలయం
ఈ నెల 26న ప్రారంభోత్సవానికి సన్నాహాలు
రూ.1.50 కోట్లతో ఏకశిల మెట్లతో నిర్మాణం
ఎస్.రాయవరం: గురజాడ జన్మ స్థలమైన ఎస్.రాయవరం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందనుంది. కేరళ శబరిమలై, ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాల తరహాలో ఎస్.రాయవరంలో ఏకశిల పతినెట్టంపడి(ఏకశిలతో 18 మెట్లు చెక్కి)తో ఆలయ నిర్మాణాన్ని ఆకర్షణీయంగా పూర్తి చేశారు. సుమారు 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 26న వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరుముడితో 18 మెట్లు ఎక్కి మొక్కు చెల్లించుకునే విధంగా ఏకశిలతో మెట్లు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఆలయం ప్రారంభం రోజున అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరిముడి సమర్పించే ఆచారం కోసం గ్రామంలో సుమారు 70 మంది భక్తులు మాలధారణ చేశారు. వారంతా 41 రోజులు దీక్ష పూర్తి చేసుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి రాజకీయ పార్టీల ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానాలు పంపారు.
ఏకశిలతో 18 మెట్లు ప్రత్యేకం
ఆలయ ధర్మకర్త ఏకశిలపై 18 మెట్లు రావాలని ప్రత్యేకంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఏకశిలను తీసుకువచ్చి మెట్లు చెక్కించారు. కేవలం మెట్లు ఏర్పాటుకే సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేశారు. 2024 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేయగా.. రెండేళ్ల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 500 మందికి పైగా భక్తులు అయ్యప్ప ఆలయ నిర్మాణంలో విరాళాలు ఇచ్చి భాగస్వాములయ్యారు.


