బ్రహ్మండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

రేపటి నుంచి ఉత్సవాలకు అంకురార్పణ

ముస్తాబైన పెందుర్తి వేంకటాద్రి

పెందుర్తి: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు పెందుర్తి వేంకటాద్రి సిద్ధమైంది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడేందుకు భూమి మీద అడుగిడిన పవిత్ర రోజు వైశాఖ శుద్ధ దశమి. అందుకే అదే రోజున ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. వేంకటాద్రి నిర్మాణానికి కూడా వైశాఖ శుద్ధ దశమి నాడే తొలి అడుగు పడింది. ఈ క్రమంలో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించి వేంకటాద్రిపై వైశాఖ శద్ధ దశమి నాడే కల్యాణం నిర్వహిస్తారు. వెంకన్న దేవాలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విష్వక్సేనపూజ, అంకురార్పణ జరుగుతుంది. రెండో రోజు శనివారం ఉదయం ధ్వజారోహణ, హోమాలు చేస్తారు. సాయంత్రం లక్ష తులసి, మల్లికా పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు జరుగుతాయి. మూడోరోజు ఆదివారం వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా సాయంత్రం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. నాలుగో రోజు సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవం జరగనుంది. వేంకటాద్రి నుంచి పెందుర్తి పురవీధుల్లో స్వామివారు రథంపై ఊరేగుతూ చినముషిడివాడ సప్తగిరినగర్‌లోని అలివేలు మంగమ్మ సన్నిధి వరకు భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. ఆఖరి రోజు మంగళవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానమాచరింపజేస్తారు. సాయంత్రం పుష్పయాగం, మహా పూర్ణాహుతి, ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్‌ సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో నీలిమ వెల్లడించారు. భక్తులంతా తరలిరావాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేంకటాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement