మాకవరపాలెం: తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని పయనీర్(ఆన్‌రాక్)అల్యూమినియం రిఫైనరీ కార్మికులు స్పష్టం చేశారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం రిఫైనరీ లోపల కార్మికులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండో రోజు బుధవారం సుమారు 500 మందికిపైగా కార్మికులు విధులు బహిష్కరించి మెయిన్ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మిక చట్టం మేరకు 8 గంటల పని, పనికి తగిన వేతనం, అదనపు పనిగంటలకు ఓటీ చెల్లింపు, ప్రతి ఏటా 10 శాతం ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్ల కల్పన, వీక్లీ ఆఫ్‌లకు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొందరు కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్‌కు అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎస్‌ఐ దామోదర్‌నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నపయనీర్ యాజమాన్యం
పయనీర్ యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


