సింహాచలం: సమష్టి కృషితో చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని, సింహాచలం దేవస్థానం ఉద్యోగులంతా అంకితభావంతో చందనోత్సం విధులు నిర్వర్తించి విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర పోషించారని ఈవో జె.వెంకటరావు అభినందించారు. దేవస్థానం ఉద్యోగుల అభినందన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చందనోత్సవం విజయవంతం కావాలని దేవస్థానంలోని ప్రతి ఉద్యోగి పట్టుదలతో పనిచేశారన్నారు. పారిశుధ్య నిర్వహణలో టాప్–3లో సింహాచలం దేవస్థానం నిలవడం గొప్ప విషయమన్నా రు. దీన్ని టాప్–1కి చేర్చాలని అభిల షించారు. ఇతర దేవస్థానాల నుంచి వచ్చిన ఉద్యోగుల సహకారం కూడా మరువలేనిదన్నారు. చందనోత్సవం స్ఫూర్తితో రానున్న జూలై 28న జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులంతా సంసిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఈవో సింగం రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, ఏఈవోలు రమణమూర్తి, తిరుమలేశ్వరరావు, పిల్లా శ్రీనివాసరావు, పతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌లు, ఉద్యోగులు పాల్గొన్నారు.


