● వచ్చేనెల 17 నుంచి
మూడురోజులపాటు నిర్వహణ
● కలెక్టర్ నిశాంతి వెల్లడి
సాక్షి,పాడేరు: పాడేరులో మోదకొండమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లో ఉత్సవ, ఆలయ కమిటీ, పలు రాజకీయ పార్టీలు, వర్తకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పలు ప్రజాసంఘాలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 17,18,19తేదీల్లో అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టర్ సమక్షంలో మోదకొండమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఎన్నుకున్నారు. ఉత్సవ ప్రచార పోస్టర్‌ను కలెక్టర్‌తోపాటు జేసీ తిరుమణి శ్రీపూజ, ఇతర నేతలంతా ఆవిష్కరించారు. అలాగే ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ నిశాంతి రూ.50 వేలు, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ రూ.10వేలు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రూ.లక్ష వ్యక్తిగతంగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో లోకేశ్వరరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రైకార్ చైర్మన్ కృష్ణారావు, మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, గౌరవ అధ్యక్షులు కిల్లు గంగన్నపడాల్, పలాసి కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు కురుసా ఉమామహేశ్వరరావు, వర్తక సంఘ నేతలు రొబ్బి శంకరరావు, శివరాత్రి నాగేశ్వరరావు, ఇమ్మిడిశెట్టి అనిల్‌కుమార్, బూరెడ్డి నాగేశ్వరరావు,ఆలయ కమిటీ సభ్యులు కిల్లు చంద్రమోహన్, కిల్లు రాధాకృష్ణ, డి.పీ.రంజిత్‌కుమార్, సల్లా రామకృష్ణ, కొణతాల సతీష్, ఏబీవీపీ నేత కొండబాబు పాల్గొన్నారు.


