తుమ్మపాల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లలోనే వేచి ఉండాల్సి వచ్చింది. రాంబిల్లిలో సీఎం మీటింగ్ పేరుతో కలెక్టర్‌తోపాటు జేసీ, డీఆర్వో ముఖ్య అధికారులెవ్వరు కలెక్టరేట్‌లో లేకుండా పోయారు. దాంతో అర్జీలు తీసుకోవడంలో జాప్యంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. మండుటెండలో సైతం దూరప్రాంతాల నుంచి ప్రయాణించి కలెక్టరేట్‌కు చేరుకుంటే అర్జీల విభజన, నమోదు కోసం కింద, మొదటి అంతస్తుల్లో పదేపదే గంటల పాటు నిలబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క దొడ్డిదారుల్లో కొందరు అర్జీలను అధికారుల వద్దకు తీసుకెళ్లడంతో కలెక్టరేట్‌లో కేకలు, అరుపుల మోతమోగింది. పదేపదే ఫిర్యాదులు చేస్తున్న అధికారులకు రవ్వంతా కూడా జాలి చూపడం లేదని, సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో పెట్టినందుకు క్షేత్రస్థాయి అఽధికారులు పగబెడుతున్నారని, సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని అర్జీదారులు వాపోతున్నారు. 2024 ఏడాది నుంచి భూసమస్యపై ప్రతి నెలా అర్జీ చేస్తున్నా అఽధికారులు పట్టించుకోవడం లేదని ఎంఎల్సీ పేరుతో చాలా కాలంగా తిప్పుతున్నారని, సమస్యను పరిష్కరించకుండా అక్రమణదారులకు అండగా అధికారులు నిలుస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్ పరిసరాల్లో అర్జీదారులకు నీడలేక చెట్లే కింద సేద తీరాల్సి వచ్చింది.
పీజీఆర్‌ఎస్–131, రెవెన్యూ క్లినిక్ –123 అర్జీలు
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కేఆర్‌ఆర్సీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆమెతోపాటు మరో డిప్యూటి కలెక్టర్ రామమణి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం పీజీఆర్‌ఎస్–131, రెవెన్యూ క్లినిక్–123లో మొత్తం 254 అర్జీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగవేణి, జిల్లా నైపుణ్యం అభివృద్ధి అధికారి గోవిందరావు, జిల్లా చేనేత అధికారి యశ్వంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
క్రిస్టియన్‌లోకి మారిన వారికి కుల ధ్రువీకరణ నిలిపివేయాలని నిరసన
సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా దళితులుగా ఉంటూ క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ నిలిపివేయడంతోపాటు దళితవాడల్లో అనధికారికంగా ఏర్పాటవుతున్న చర్చిలపై చర్యలు తీసుకుని దళిత హిందువుల హక్కులను కాపాడాలంటూ హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు బోని గణేష్, జిల్లా అధ్యక్షుడు మైలపల్లి పోతురాజు మాట్లాడుతూ దళిత వాడల్లో క్రైస్తవ మతాన్ని తీసుకొని ప్రార్థనలు చేస్తూ హిందు దళితులను అవమానిస్తూ, దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న క్రైస్తవుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. మిడిమిడి జ్ఞానంతో పాస్టర్లుగా అవతారమెత్తి అమాయక ప్రజలను మతం మారుస్తున్నందున చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
అనుమతులు లేని చర్చిలను తొలగించి, రాజ్యంగం ద్వారా నిజమైన (హిందూ, బౌద్ధులు, సిక్కులు) జీవన విధానం కొనసాగుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ పొందే హక్కు కొనసాగించాలన్నారు. దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇస్తున్నా పట్టించుకోకుండా తహసీల్దార్లు వారికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం నిలిపివేయాలన్నారు. క్రైస్తువులుగా మారిన వారిని గుర్తించి వారికిచ్చిన ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను తక్షణమే రద్దు చేయాలని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించారు.
22ఏలో చేర్చిన జిరాయితీ భూమిని
తొలగించాలని వినతి
ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం తప్పుగా నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చిన జిరాయితీ భూమిని తొలగించి న్యాయం చేయాలంటూ గాజువాకలోని కర్ణంవానిపాలెంకు చెందిన కరణంరెడ్డి నరసింగరావు పీజీఆర్‌ఎస్‌లో వినతి అందించారు. అనకాపల్లి ఆవఖడం సర్వే నంబరు 1549/1లో 60 సెంట్లుగా ఉన్న భూమిని సర్వే నంబరు 1549లో చేర్చి నిషేధిత జాబితాలో నమోదైందన్నారు. ఈ మేరకు గతంలో ఫిర్యాదు చేయగా, ఆర్డీవో, జీవీఎంసీ జోనల్ కమిషనర్, తహసీల్దార్ జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి 1549/1గా సర్వే నివేదికను మంజూరు చేసినప్పటికి 22(ఏ) జాబితాలో నుంచి మాత్రం తొలగించలేదన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
పంట కాలువల్లో మురుగుపై ఫిర్యాదు
చేస్తే చర్యలు శూన్యం
పంట కాలువల్లో మురుగు రాకుండా చేయుటకు ఫిర్యాదు తీసుకొస్తే ఆన్‌లైన్‌లో సర్వే అధికారులకు ఎండార్స్ చేసి ముగించేశారంటూ చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన కోనేటి లక్ష్మి కలెక్టరేట్ అధికారులను ప్రశ్నించింది. జగనన్న కాలనీ గృహాల మురుగునీరు సాగునీటి కాలువలో కలిసిపోవడంతో పొలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నిరోజుల క్రితం కలెక్టరేట్‌కు వస్తే సంబంధం లేని సర్వే శాఖకు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆమె వాపోయింది. ఈ మేరకు సోమవారం మరలా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. మురుగు కారణంగా నివాసంతోపాటు పంట పొలాలు పూర్తిగా పాడవుతున్నాయని, పంచాయతీలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కలెక్టరమ్మ స్పందించి న్యాయం చేయాలని కోరింది.
ఫోర్జరీ పత్రాలతో దళిత ఆదివాసీల భూముల ఆక్రమణకు యత్నం
ఫోర్జరీ పత్రాలతో వారసత్వ హక్కులు సృష్టించి దళిత, ఆదివాసీలు సాగు భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి అండగా నిలిచిన తహసీల్దారు, అక్రమణదారుడు ఆర్.చంద్రశేఖర్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీపీఐఎంఎల్ లిబరేషన్, ఏపీ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో దళిత, ఆదివాసీలు భారీ ధర్నా చేశారు. రోలుగుంట మండలం అడ్డసారం దువ్వూరి సూర్య ప్రకాశం పేరుతో భూమిలో దళిత బహుజన ఆదివాసీ పేదలు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. సాగుదారులుగా దళితులు పేరున రెవెన్యూ రికార్డులు నమోదై ఉన్నప్పటికి వారికి న్యాయం చేయకుండా అధికారులు అక్రమణదారులతో కుమ్మక్తె యలమంచిలికి చెందిన ఓ వ్యక్తి సూర్యప్రకాశం దత్తత పుత్రిడినంటూ ఫోర్జరీ పత్రాలతో వచ్చి కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ఘటనపై జరిగిన వివాదంలో జాయింట్ కలెక్టర్ గ్రామసభ నిర్వహించి అక్రమాలు గుర్తించారు. నేటికి వివాదం జరుగుతున్నప్పటికి సదరు భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి సాగులో ఉన్న దళిత, బహుజన ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


