దగ్గరోడే దొంగ | - | Sakshi
Sakshi News home page

దగ్గరోడే దొంగ

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

● బంధువుల ఇంట్లో 10 తులాల బంగారం చోరీ ● సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు ● నిందితుడు అరెస్టు

నక్కపల్లి : దగ్గరోడే దొంగయ్యాడు. చుట్టంచూపునకు వచ్చి ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాధితులు తమ ఇంట్లో బంగారం చోరీ జరగడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానితుడిని పట్టుకుని విచారించి అతనినుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నక్కపల్లి సీఐ జె.మురళి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ముకుందరాజుపేట గ్రామానికి చెందిన మనబాల రమణ ఈ నెల18వ తేదీన ఇంటికి తాళం వేసి శ్రీరాంపురం వైన్‌షాపులో పనిచేసేందుకు వెళ్లాడు. ఇతని తల్లి రేబాకలో కూలి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు రూ.15 లక్షలు విలువైన పదితులాల బంగారు ఆభరణాలు ( చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిదుద్దులు) చోరీ అయినట్టు గుర్తించారు. రమణ వెంటనే నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కొల్లి శ్రీను (ఫిర్యాధి బందువు) చోరీ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు. 19వ తేదీన వేంపాడు టోల్‌ప్లాజా వద్ద నిందితుడు శ్రీనును అదుపులోకి తీసుకుని అతని నుంచి చోరీ చేసిన 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్‌ విధించినట్టు సీఐ తెలిపారు.

నిందితుడు బాధితులకు సమీప బందువు కావడం, చోరీ జరిగిన రోజు ఇతను ముకుందరాజుపేట వెళ్లడం ఇంటి వద్ద తమ బంధువులు లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఇతడు చోరీ జరిగిన రోజున గ్రామంలోకి వచ్చినట్లు చుట్టుపక్కల వారిద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు చెప్పడంతో ఆ కోణంలో విచారణ జరిపి చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించగలిగారు.

Advertisement
 
Advertisement
Advertisement