అచ్యుతాపురం రూరల్: దళితులు ఐకమత్యంగా, మహిళలు చైతన్యవంతంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రజా ప్రతినిధి మంచా నాగ మల్లేశ్వరి కోరారు. గుబ్బల నూకరాజు ఆధ్వర్యంలో మండలంలో పెదపాడు గ్రామంలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘనంగా నివాళిలర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజంలో గుర్తింపు తీసుకురావడంలో అంబేడ్కర్ చేసిన కృషి మరువ లేనిదన్నారు. ముఖ్యంంగా మహిళలు చదువుకున్నట్టయితే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. ఏదైనా సాధించాలంటే చదువు అత్యంత అవసరమన్నారు. యువత చైతన్య వంతులై ఉండాలని, నాయకుల ప్రలోభాలకు లోనవకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులది, లేదంటే సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చిన అంబేడ్కర్ ఫొటోని మాత్రమే మొబైల్ వాట్సాప్ డీపీలో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ భవనం అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు, మాజీ జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది తట్టా పెంటయ్యనాయుడు, అనకాపల్లి జిల్లా డీవీఎంసీ మాజీ సభ్యుడు రేబాక మధుబాబు, వైఎస్సార్‌సీపీ మండల ఎస్సీ సెల్ అద్యక్షుడు తట్టా రాజు, బీలా అప్పారావు, పెదపాడు అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.


