అనకాపల్లి : జిల్లాలో తాండవ, ఏటి కొప్పాక, తుమ్మపాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వాలు మూసివేయడం అన్యాయమని, ఫ్యాక్టరీలను ఆధునికీకరించి, రైతులు, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతాంగం ఏ పంటలు పండించాలో అర్థం కాక వేల ఎకరాల భూములు బీడుగా ఖాళీగా ఉంచడం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాలో గల షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి, ఆధునికీకరించి నడిపిస్తామని జిల్లాలో రైతులను, కార్మికులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ మూత పడ్డ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం జిల్లా రైతాంగాన్ని, కార్మికులను మోసం చేయడమే అవుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, నాయకులు గండి నాయన బాబు, శివ, ఎస్.వి.నాయుడు, బ్రహ్మాజీ, సత్యనారాయణ, జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.


