అనకాపల్లి : సహిత విద్యా విభాగం ప్రత్యేక మాడ్యూల్స్ ఉపయోగించి బోధిస్తూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు సమష్టిగా కలిసి సహిత విద్యను బలోపేతం చేయాలని జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణనాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కొప్పాక డీఈవో కార్యాలయంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు సోమవారం ప్రత్యేక బోధన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 24 మండలాల్లో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు, ఎంఈవోలకు , భవితా కేంద్రాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ,దివ్యాంగ విద్యార్థులకు ఏడు రకాల ప్రత్యేక మాడ్యూల్స్ మొత్తంగా 1347 మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. ప్రత్యేక మాడ్యూల్స్ ద్వారా సవర్ణాత్మక బోధనకు తోడు విద్యార్థులో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించడమే కాక గుణాత్మకత, సాంకేతికతతో కూడిన నూతన విద్యా బోధన ద్వారా మరింత అభ్యున్నతిని సాధించేలా చేయవచ్చు అన్నారు. ప్రత్యేక మాడ్యూల్ విధానం సహిత విద్యలో మరింత ప్రగతికి దోహదపడుతుందని, నిర్దేశిత లక్ష్య సాధనకు, పిల్లల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర పర్యవేక్షణ అధికారి బి.మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు.


