25 నుంచి రిలే నిరాహార దీక్షలు | - | Sakshi
Sakshi News home page

25 నుంచి రిలే నిరాహార దీక్షలు

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

● పీఆర్సీ అమలు చేయాలని ఫ్యాప్టో డిమాండ్‌

అనకాపల్లి: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, 12వ పీఆర్సీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా ప్రధాన కార్యదర్శి యేళపోగు సుధాకర్‌రావు, ఏపీటీఎఫ్‌ 257 జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌ బోయిన చిన్నారావు డిమాండ్‌ చేశారు. స్థానిక ఫ్యాప్టో కార్యాలయలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మలిదశ పోరాటానికి ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం చర్యలు చేపట్టిందన్నారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొత్త పీఆర్సీ అమలు చేసేవరకూ 30 శాతం మధ్యంతర భృతిని మే నెల నుంచి అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతో దీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 27న జిల్లా ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మీ, వై.శ్రీనివాసరావు, కెవిఆర్‌.శేషు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement