సింహాచలం: సింహగిరిపై అవతరించిన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ వేళయింది. వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని స్వామివారు సోమవారం తన నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఏడాదంతా చందన రూపుడి(నిత్యరూపం)గా కనిపించే స్వామి మణుగుల చందనం నుంచి బయటకు వచ్చి, నిజరూపంతో దర్శనమివ్వనున్నాడు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప భరితుడిని చేస్తారు. వేకువజాము 3 గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు తొలి దర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి భక్తులకు ఉచిత, రూ.300 దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటల నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. సింహగిరిపై గంగధార నుంచి శ్రీవైష్ణవస్వాములు కలశాలతో తీసుకొచ్చిన నీటితో స్వామివారి నిజరూపానికి అభిషేకం నిర్వహిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం, విశేష పూజల అనంతరం తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించి మరల నిత్యరూపభరితున్ని చేస్తారు. నిజరూప స్వామికి ధరింపజేసే శిరోచందనం, హృదయచందనాన్ని వైదికులు ఇప్పటికే సిద్ధం చేశారు.
పటిష్ట ఏర్పాట్లు
ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా. ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000ఽ, రూ.1,500ల దర్శనం టికెట్ల క్యూలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. టికెట్లపై పొందుపరిచిన సమయాల(స్లాట్ల) ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరి పైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. దర్శనానంతరం దక్షిణ రాజగోపురం ద్వారా బయటకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఈ మేరకు 40 గ్రాముల లడ్డూలను లక్షా 50 వేలు సిద్ధం చేశారు. చందనోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,300 మందితో పోలీస్ బందోబస్తు, సింహగిరిపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నారు.
భక్తులందరికీ అన్నప్రసాదం
చందనోత్సవానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం అందించనున్నారు. కొండ దిగువ శ్రీకృష్ణాపురంలోని గోశాల, అడవివరం జంక్షన్, తొలిపావంచా, సింహపురికాలనీ, శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం కల్యాణమండపాల వద్ద కేవలం లడ్డూ ప్రసాదాలు మాత్రమే విక్రయిస్తారు. ఈ మేరకు 80 గ్రాముల లడ్డూలు సుమారు లక్ష సిద్ధం చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత
చందనోత్సవం ఏర్పాట్లను ఆదివారం హోంమంత్రి అనిత పరిశీలించారు. దర్శనాల క్యూలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాఫీగా జరిగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత చందనోత్సవ అనుభవాల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీస్ అధికారులు హోంమత్రికి తెలియజేశారు. మంత్రి వెంట దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఈవో జె.వెంకటరావు, డీసీపీ–2 మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు.
● సీఎం రమేష్‌కి 30 వరకూదర్శనం టికెట్లు
● సొంత సర్కారులోనే అవమానమంటూ ఎమ్మెల్యేల అసహనం
● తమపై మాత్రం వివక్ష అంటూకలెక్టర్‌పై గుర్రు
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం వేళ.. అధికారుల అత్యుత్సాహం అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలోనే తమకు దక్కాల్సిన గౌరవం గంగలో కలిసిందంటూ తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి ‘అనకాపల్లి’ అతిథులకు రెడ్ కార్పెట్ పరచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ సీఎం రమేష్ అనుచర గణం కోసం ఏకంగా 30 టికెట్లు కేటాయించి, స్థానిక ఎంపీ భరత్‌తో పాటు ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం సమయంలో తమపై కలెక్టర్ వివక్ష చూపించారంటూ.. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు వంటి సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మా ప్రభుత్వం.. మా అప్పన్న.. కానీ మాకే దర్శనం లేదు’ అన్నట్టుగా తయారైంది పరిస్థితంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారు. కలెక్టర్ కట్టబెట్టిన ఈ ‘విశిష్ట’ ప్రాధాన్యతపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. స్థానిక ప్రతినిధుల కంటే వలస నేతలకే విలువ ఎక్కువన్నట్లుగా ఉందని కేడర్ మండిపడుతోంది. ఎంపీ భరత్ సైతం అధికారుల తీరుపై నిప్పులు చెరుగుతుండటంతో, చందనోత్సవ ఏర్పాట్లు కాస్తా రాజకీయ రణరంగంగా మారాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనుచరగణానికి మాత్రం ఏకంగా 30 అంతరాలయ టికెట్లను ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా ఇంట్లో వేడుకకు పొరుగువారికి పీట వేసి, మమ్మల్ని గేటు బయట నిలబెడతారా?’ అంటూ ఎంపీ భరత్ సహా ఎమ్మెల్యేలు కలెక్టర్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు.
అప్పన్న సాక్షిగా ‘అంతరాలయ’ రాజకీయం
ఉదయం 3.30 నుంచి
ఉచిత, రూ.300 దర్శనం
రాత్రి 7 గంటలకు క్యూల
ప్రవేశ ద్వారాలు మూసివేత
రాత్రి 8 నుంచి సహస్ర ఘటాభిషేకం, తొలి విడత చందన సమర్పణ


