సినిమా తరహాలో యథేచ్ఛగా అక్రమ దందా
ఆంధ్రా– ఒడిశా సరిహద్దులోని మత్స్యగెడ్డ దీవులు
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మత్స్యగెడ్డ నదీ పరివాహక ప్రాంతం ఇప్పుడు గంజాయి స్మగ్లర్లకు సురక్షిత స్థావరంగా మారింది. మత్స్యగెడ్డ మధ్యలో ఉన్న దీవులు, చుట్టూ దట్టమైన అడవులు, కొండల మధ్య స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లు విలువ చేసే గంజాయి లిక్విడ్‌ను తయారు చేస్తున్నారు.
● ఇటీవలే విడుదలైన అనుష్క నటించిన ’ఘాటీ’ సినిమాలో గంజాయి లిక్విడ్ తయారీ ప్రక్రియను దర్శకుడు క్రిష్ ఏ విధంగా చూపించారో, సరిగ్గా అదే తరహాలో ఏవోబీ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ అక్రమ దందా సాగుతోంది. 1955లో నిర్మించిన జోలాపుట్టు, డుడుమ జలాశయాల కారణంగా ఒడిశాలోని 154 గ్రామాలు, ఆంధ్రాలోని 84 గ్రామాల గుండా మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. ఈ ప్రవాహం మధ్యలో ఏర్పడిన దీవులను స్మగ్లర్లు తమ కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నారు. రోడ్డు మార్గాల్లో పోలీసుల తనిఖీలు పెరగడంతో, స్మగ్లర్లు తమ పంథా మార్చి జలమార్గాలను ఎంచుకుంటున్నారు.
రసాయన శాస్త్రవేత్తల సాయంతో..
చుట్టూ నీరు ఉండటంతో పోలీసులు సులభంగా రాలేరనే ధీమాతో స్మగ్లర్లు ఇక్కడ భారీ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూట పడవల ద్వారా గంజాయిని దీవులకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ గంజాయి నుంచి లిక్విడ్‌ను వెలికితీసేందుకు కొంతమంది రసాయన శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు, మిక్సీలు, ప్రెజర్ కుక్కర్లు, బాట్లింగ్ యూనిట్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మూడు అంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ స్వాధీనం
ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఒడిశా పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఈ గంజాయి మాఫియా గుట్టు రట్టయింది. కోరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో పాడువ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్స్యగెడ్డ దీవులపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఎంతో రహస్యంగా బోట్ల ద్వారా వెళ్లిన పోలీసులను చూసి స్మగ్లర్లు పడవల్లో పరారయ్యారు. అక్కడ లభించిన సుమారు 1800 లీటర్ల గంజాయి లిక్విడ్‌ను చూసి పోలీసులు విస్తుపోయారు. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఒక పూర్తి స్థాయి ఫ్యాక్టరీని తలపించేలా ఉన్న ఆ తయారీ కేంద్రాన్ని చూసి ఉన్నతాధికారులే ఆశ్చర్యపోయారు.
డ్రోన్లతో గాలింపు చర్యలు
స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్ర – ఒడిశా పోలీసులు ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మనుషులు వెళ్లలేని దుర్భేద్యమైన కొండ ప్రాంతాలు, మత్స్యగెడ్డ దీవులపై అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా సేకరిస్తున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల (ఆంధ్రప్రదేశ్), పాడువ, లంతాపుట్టు, మాచ్‌ఖండ్ (ఒడిశా) ప్రాంతాల పోలీసులు సమన్వయంతో సరిహద్దుల్లోని గంజాయి నెట్‌వర్క్‌ను నిర్మూలించే పనిలో నిమగ్నమయ్యారు.
స్మగ్లర్లను పట్టుకుంటాం
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి రవాణా, సాగు, లిక్విడ్ గంజాయి తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాం. డ్రోన్ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేశాం. మండల కేంద్రాల్లో ఉదయం, రాత్రిపూట సైతం తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం.గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నా తమకు పట్టుబడి తీరాల్సిందే. మత్స్యగెడ్డ పరివాహిక ప్రాంతాలు, దీవులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పూర్తిగా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– అమిత్ బర్దర్, ఎస్పీ, పాడేరు


