శిథిలావస్థలో ఉపాధ్యాయుల క్వార్టర్లు | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో ఉపాధ్యాయుల క్వార్టర్లు

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల క్వార్టర్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉపాధ్యాయులు భయం భయంగా గడుపుతున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ 12 భవనాలు నిర్వహణ లేక పూర్తిగా పాడైపోయాయి. తలుపులు, కిటికీలు ఊడిపోయి దర్శనమిస్తున్నాయి. స్వల్ప వర్షానికే పైకప్పుల నుండి నీరు కారుతుండటంతో, నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు పైకప్పులపై టార్పాలిన్‌ పట్టాలు కప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారు. భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్నాయని, మరికొన్ని భవనాలు ఇప్పటికే నివాస యోగ్యం కాకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్ల దుస్థితిపై ఉపాధ్యాయులు, స్థానిక నేతలు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి తక్షణమే ఈ 12 భవనాలకు మరమ్మతులు చేపట్టి, తమ నివాస ఇబ్బందులను తీర్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

భయం నీడలో గిరిజన ఆశ్రమ

పాఠశాల ఉపాధ్యాయులు

Advertisement
 
Advertisement
Advertisement