● పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ నిషాంతి ఆదేశం
పాడేరు: జిల్లా లో ఈనెల 24 న జరగనున్న పాలిసెట్, ఏపీఆర్‌ఎస్ ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహణపై ఆమె పలు సూచనలు చేశారు.పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడటంతో పాటు, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా మార్గాల్లో తగినన్ని బస్సులను నడపాలని రవాణా శాఖను ఆదేశించారు.ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించాలని, నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో ఉన్న అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో విద్యా, ఆరోగ్య, రవాణా, రెవెన్యూ, పోలీస్ మరియు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


