చింతపల్లి: అంతర్జాతీయ మార్కెట్‌లో అరకు కాఫీ ఉత్పత్తులను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రీన్ ఆయుష్ సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ సీఈవో పులి రాజేష్ అన్నారు. పెదబరడ పంచాయతీ పరిధిలోని వంగసార గ్రామంలో థింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో కలిసి గిరిజన కాఫీ రైతులకు ఆదివారం అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాఫీ గింజలతో పాటు కాఫీ లీఫ్ (ఆకులు) ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయని రాజేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టును జిల్లా జాయింట్ కలెక్టర్ పైలెట్ ప్రాజెక్టుగా చింతపల్లి మండలానికి కేటాయించారని, ఇందుకోసం థింసా ఆర్గానిక్ ఎఫ్‌పీఓతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం కాఫీ గింజల ద్వారానే ఆదాయం పొందుతున్న రైతులకు, ఇకపై కాఫీ ఆకుల సేకరణ ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని తెలిపారు. సుమారు 25 ఎకరాల్లో కాఫీ ఆకుల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని, కిలో ఆకులకు రూ.17.50 ధర చెల్లిస్తామని ప్రకటించారు. మొక్కలోని అదనపు కొమ్మలను తొలగిస్తూ ముదురు ఆకులను సేకరించాలని రైతులకు సూచించారు. మరో వారం రోజుల్లో ఈ సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో థింసా ఆర్గానిక్ సీఈవో ఆనంద్, గ్రీన్ ఆయుష్ ప్రతినిధులు బి. బుజ్జిబాబు, కనకారావు, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఆయుష్ సంస్థ సీఈవో రాజేష్


