సెల్‌ సిగ్నళ్లు లేకగిరిజనుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

సెల్‌ సిగ్నళ్లు లేకగిరిజనుల అవస్థలు

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

ముంచంగిపుట్టు: మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ పరిధి గుమ్మసిరగంపుట్టు, రాములు, తేనేలమామిడి, సరియాపుట్టు గ్రామాల్లో సెల్‌ సిగ్నళ్లు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునిక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పనినీ ఆన్‌లైన్‌తో ముడిపెడుతుండటంతో, సిగ్నల్‌ కోసం గిరిజనులు కిలోమీటర్ల మేర పరుగులు తీయాల్సి వస్తోంది.

అనారోగ్యం పాలైనప్పుడు 108 అంబులెన్స్‌కు లేదా ఆరోగ్య కేంద్రాలకు ఫోన్‌ చేయాలన్నా సిగ్నల్‌ దొరకని పరిస్థితి నెలకొంది. పింఛన్లు, ఈ–కేవైసీ, బయోమెట్రిక్‌ వంటి పనుల కోసం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. సిగ్నల్‌ లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలను సకాలంలో పొందలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో సెల్‌ టవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు ఇప్పటికే పలుమార్లు గ్రామ సభల్లో తీర్మానించి, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం. శ్రీను నేతృత్వంలో ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి సెల్‌ టవర్లు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement