అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

దేవరాపల్లి: మండలంలోని కొత్తూరు ముత్యాలమ్మపాలెంలో వృద్ధుడు తమరాన అప్పారావు(77) అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన అప్పారావు సంతానం లేకపోవడంతో మానసిక వేదనతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతంలోను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పట్లో కుటుంబ సభ్యులు గమనించి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున పొలానికి వెళ్తున్నట్లు భార్య అచ్చియ్యమ్మకు చెప్పి అప్పారావు ఇంటి నుంచి బయలుదేరాడు. పొలంలో నోటి నుంచి నురగ కారుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపైన తమకు అనుమానం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే సరైన వివరాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement