పైలెట్‌ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు | - | Sakshi
Sakshi News home page

పైలెట్‌ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

పైలెట్‌ ప్రాజెక్టు ప్రదేశంలో ఇసుక తవ్వకాలు

నాతవరం: స్పీకర్‌ ఇలాకాలో కూటమి నేతలు అండతో తాండవ నదిలో ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. పర్యవసానంగా ఇక్కడ తాగునీటి పైలెట్‌ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. దాంతో 20 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మండలంలో గుమ్మడిగొండ పంచాయతీ శివారు చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో నిర్మించిన పైలెట్‌ ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.

మండలంలో అనంత పద్మనాభపురం, ఎం.బి.పట్నం మన్యపురట్ల, గన్నవరం పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ఫోరైడ్‌ సమస్య ఉంది. దీనిపై దృష్టి సారించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తాండవ నదిలో ౖపైలెట్‌ ప్రాజెక్టు నిర్మించి పైపులైను ద్వారా పదేళ్లుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టుపై ఆధారపడి రాజుపేట అగ్రహారం, లింగంపేట, మన్యపురట్ల, కొత్త రామచంద్రపురం, ఉప్పరగూడెం, గన్నవరం, నాయుడుపాలెం, వి.బి.అగ్రహారం, వై.బి. అగ్రహారం, మాసయ్యపేట, వై.బి.పట్నం, బుచ్చెంపేట, ఎ.శరభవరం, ఎం.బి.పట్నం తదితర గ్రామాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇసుక తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇదే అవకాశం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో పైలెట్‌ ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇక్కడ పైలెట్‌ ప్రాజెక్టు చుట్టూ ఇసుక తవ్వకాలు చేయరాదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు హెచ్చరించారు. వారి మాటలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తుండటంతో ప్రాజెక్టు ప్రమాదాన్ని గ్రహించిన సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారుల వేసిన కంచె తొలగించి తవ్వకాలు

మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సంయుక్తంగా నదిలో ప్రాజెక్టును పరిశీలించారు. ఇసుక తవ్వకాలు ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టుకు ప్రమాదం జరుగుతుందని నిర్ధారించారు. ప్రాజెక్టు సమీపంలో తవ్వకాలు జరగకుండా ఉండేందుకు దారిలో ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయకుండా హెచ్చరికలు చేశారు. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఇక్కడ తవ్వకాలు చేయకుండా మానేశారు. ఆ తర్వాత కంచెను తీసేసి

మరలా తవ్వకాలు మొదలు పెట్టారు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలే దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఉచిత ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు బ్యానర్లు మచ్చుకై నా కనిపించకపోవడం గమనార్హం. ఈ విధంగా నిబంధనలు పాటించకుండా రేయింబవళ్లు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రాంతం స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో ఉండడంతో అధికారులు భయపడి చోద్యం చూస్తున్నారు.

అధికారులు దృష్టి సారించాలి

తాండవ నదిలో ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. నదిలో తవ్వకాలు వల్ల పైలెట్‌ ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లి వేలాది మంది ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. అనధికార తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు భయపడితే అధికారులు ప్రజల నమ్మకం కోల్పోతారు.

–ఎ.చిన్నంనాయుడు, సీపీఐ మండల కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement