వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

మాడుగుల రూరల్‌: వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు లేత రంగులో ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. తలకు టోపీ లేదా గొడుగు వాడడం మంచిది. ఈ సందర్భంగా వడదెబ్బకు గురైన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు గురించి కె.జె.పురం పీహెచ్‌సీ వైద్యాధికారి ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌. ప్రసాదుపాత్రుడు పలు సూచనలు చేశారు.

వడదెబ్బ తగిలినప్పుడు చెయ్యవలిసినవి:

శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, వడదెబ్బ బారిన పడిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా ఎ.సి. ఉన్న గదిలోకి మార్చాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడిస్తూ ఫ్యాన్‌ కింద ఉంచాలి. వీలైతే ఐస్‌ ప్యాక్‌ మెడ, చంకలు, గజ్జల భాగంలో ఉంచితే త్వరగా వడ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. స్పృహలో ఉంటే నీళ్లు, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, లేదా మజ్జిగ తాగించాలి. ఒక వేళ బాధితుడు స్పృహ కోల్పోతే నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదు. గాలి తగేలా బిగుతుగా ఉన్న దుస్తులను కొద్ది మేర సడలించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి విపరీతమైన జ్వరం, మూర్చ, స్పృహ తప్పడం వంటివి జరిగితే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆస్పత్రికి తరలించాలి. దాహం వెయ్యకపోయినా సరే ప్రతి గంటకు ఒక సారి నీళ్లు తాగించాలి. కోలుకుంటున్న సమయంలో కాఫీ, టీ, ఆల్కహాల్‌కు దూరంగా ఉంచాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి జ్వరం వస్తే పారాసెటమెల్‌ లేదా ఆస్పిరెన్‌ వంటివి సొంతంగా వాడకూడదు. ఇవి కొన్నిసార్లు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి. కేవలం వైద్యులు సలహా మేరకు మందులు వాడాలి. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ సోకకుండా ఉండవచ్చు. ఏప్రిల్‌, మే, జూన్‌ మొదటివారం వరకు వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రతలు తీసుకోవాలని ప్రజలకు వైద్యాధికారి ప్రసాదుపాత్రుడు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement