జల సంరక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

జల సంరక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

పెదబయలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా, జల సంరక్షణపై రైతులు, ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి. నిశాంతి పిలుపునిచ్చారు. శనివారం పెదబయలు మండలం, పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలోని పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి పరిశీలన..

గ్రామ పొలిమేర నుంచి ప్రజలతో కలిసి కాలినడకన పర్యటించిన కలెక్టర్‌, స్వచ్ఛత, పరిశుభ్రత, జలవనరుల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్‌ పలు కీలక సూచనలు చేశారు. భావి తరాల కోసం భూగర్భ జలమట్టాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను పాటించాలని సూచించారు. గ్రామం పచ్చగా, శుభ్రంగా ఉంటే దోమలు దరిచేరవన్నారు. కాలువల్లో నీరు నిల్వ ఉంటే మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని, అందువల్ల మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలను వాడాలని, ఇళ్ల లోపల, బయట దోమల నివారణ మందులను పిచికారీ చేయించుకోవాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలన్నారు. ఆహారపు అలవాట్లలో భాగంగా ఆర్గానిక్‌ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌, అక్కడికక్కడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్‌వాడీ భవనం, పాఠశాల భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. వంతెన పనులకు అనుమతి జారీ చేశారు. వెల్‌నెస్‌ సెంటర్‌, హాట్‌ బజార్‌, డంపింగ్‌ యార్డులకు విద్యుత్‌ సౌకర్యం లేదని గ్రామస్తులు తెలపడంతో, 15 రోజుల్లోగా కరెంట్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు ఎవరైనా రేషన్‌ కార్డులు లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరగా, డూరుపల్లి గ్రామంలో అధికారులతో కలిసి జల సంరక్షణ, స్వచ్ఛతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇన్‌చార్జ్‌ ఆర్డీవో లోకేశ్వరరావు, డీఎల్పీవో పీఎస్‌ కుమార్‌, డీఈవో కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, ఎంపీడీవో శ్యాంసుందర్‌, మండల అధికారులు పాల్గొన్నారు.

గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ నిశాంతి

డూరుపల్లి గ్రామానికి గెడ్డదాటి వెళ్తున్న కలెక్టర్‌ నిశాంతి తదితరులు

కలెక్టర్‌ నిశాంతి

Advertisement
 
Advertisement
Advertisement