కొయ్యూరు/గూడెంకొత్తవీధి: చింతపల్లి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మృత్యువు లోయ రూపంలో నోరు తెరుచుకున్నా.. డ్రైవర్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తి పది మంది ప్రాణాలను కాపాడింది. లేదంటే ఆ వ్యాన్ పాతాళంలోకి పడి ఘోర విషాదం చోటుచేసుకునేది.
అసలేం జరిగిందంటే..
రాజమహేంద్రవరానికి చెందిన కొందరు వ్యాపారులు చింతపల్లిలో జరిగిన ముత్యాలమ్మ ఉత్సవాలకు కృత్రిమ పూలు, ఇతర వస్తువుల విక్రయానికి వచ్చారు. ఉత్సవాలు ముగియడంతో శనివారం ఉదయం వారు లోతుగెడ్డ జంక్షన్‌కు చెందిన ప్రసాద్ అనే డ్రైవర్ వ్యాన్ లో తిరిగి రాజమహేంద్రవరం బయలుదేరారు. మొ త్తం పది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ వ్యాన్.. బొంతువలస గ్రామ సమీపంలోని మలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
డ్రైవర్ వీరోచిత నిర్ణయం
లోతైన లోయలు, ప్రమాదకరమైన మలుపులు ఉన్న ఆ మార్గంలో ఒక్కసారిగా బ్రేకులు పనిచేయకపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్తున్న తరుణంలో డ్రైవర్ ప్రసాద్ బెదిరిపోలేదు. లోయలోకి పడకుండా ఉండేందుకు వాహనాన్ని నియంత్రిస్తూ, పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టారు. చెట్టు అడ్డుగా రావడంతో వ్యాన్ ఆగిపోయింది.. ఆ పది మంది ఊపిరి పీల్చుకున్నారు.
తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చున్న నీరజ్ యల్లమ్మ, మాధురి గుడియాలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ప్రసాద్ కుడి కాలుకు బలమైన దెబ్బ తగలడంతో ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. అలాగే అర్సడు, రామ్ డిల్లి, రోజిలీలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న మాధురి, నీరజ్ యల్లమ్మ, డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేక్‌లు ఫెయిల్ అయి అదుపుతప్పిన వాహనం
డ్రైవర్ చాకచక్యంగా చెట్టును
ఢీకొట్టడంతో తప్పిన పెను ప్రమాదం
క్షతగాత్రులు ఆస్పత్రికి తరలింపు


