● డీఎల్పీవో పీఎస్ కుమార్
పాడేరు రూరల్: గ్రామ సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎల్పీవో పీఎస్ కుమార్ కోరారు. మండలంలో పాడేరు మేజర్ పంచాయతీ గ్రామసభను మోదమాంబ కల్యాణ మండపంలో పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా పంచాయతీ, గ్రామ సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధానంగా వేసవిలో తాగునీటి సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. గ్రామాల్లో పథకాలు మొరాయించడంతో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని వారు వివరించారు. దీనిపై తదుపరి చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, పీసా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


