చింతపల్లిలో జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చింతపల్లిలో జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

చింతపల్లి: స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ 11వ వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పసుపులేటి బాలరాజు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. మే 1వ తేదీన జరగనున్న ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైన ఈ పోటీల్లో తొలిరోజు తలపడుతున్న చౌడుపల్లి – డిగ్రీ కళాశాల జట్ల క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం స్వయంగా బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత యువతలో అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉందని, అయితే సరైన వేదికలు లేక చాలామంది వెలుగులోకి రాలేకపోతున్నారని అన్నారు. గ్రామదేవతల పండుగల సందర్భంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల ప్రతిభ వెలికివస్తుందని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆకాంక్షించారు.ఈ టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు తలపడనున్నాయి. విజేతలకు అందించే బహుమతుల వివరాలను నిర్వాహక కమిటీ ప్రకటించింది.ప్రథమ బహుమతి దివంగత పసుపులేటి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం రూ. 50వేలు, ద్వితీయ బహుమతి ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్య, ఎంపీటీసీ పద్మ తరఫున రూ. 25 వేలు అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పసుపులేటి వినాయకరావు, పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బేతాళుడు పాల్గొన్నారు. అలాగే నిర్వాహక కమిటీ సభ్యులు దాసరి మత్స్యరాజు, వడ్డే శ్రీనివాస్‌, మాసాడ రాము, తరుణ్‌, పృథ్వీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement