నేటి నుంచి చింతపల్లిలో జాతర ప్రారంభం
అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ
2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా
చింతపల్లి: మన్యం ప్రజల ఆరాధ్యదేవత ముత్యాలమ్మతల్లి జాతరకు చింతపల్లి ముస్తాబయింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.జిల్లాలో పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవం తరువాత జరిగే అతిపెద్ద రెండవ జాతర ఇదే. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ఉత్సవ కమిటీ చేపట్టింది.ఏటా ఈ ఉత్సవాలను నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. జాతరకు రెండు లక్షల మంది హాజరవుతారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లను, భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మొదట డప్పుల పండగగా..
చింతపల్లిలో ఐదు దశాబ్దాలు కిందట అమావాస్య రోజున ముత్యాలమ్మ తల్లి పండగను డప్పుల పండగగా ప్రారంభించారు. ఒక్క రోజు పండగను నిర్వహించేవారు. అనంతరం 1990వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మన్యం వాసుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ తల్లి జాతర మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. 15వ తేదీ బుధవారం అమ్మవారి పూజారు(సుర్ల వంశస్తుల)ల ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం,ఇత్తడి పాదాలు,గరగలను ఊరేగింపుగా సతకం పట్టువరకూ తీసుకువచ్చి తొలిరోజు కొలువు దీరుస్తారు.16వతేదీ గురువారం రాత్రి సతకం పట్టువద్ద కొలువు దీరిన అమ్మవారిని చింతపల్లిలో గల అన్ని వీధుల్లో ఊరేగించి, తెల్లవార్లూ జాగరణ జరిపి, తిరిగి పూజారుల ఇంటికి చేరుస్తారు. 17వ తేదీ శుక్రవారం చివరి రోజున పెద్ద పండగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు హాజరై చీర సారెలు సమర్పిస్తారు.సాయంత్రం పూజారుల ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘటాలను భారీ ఊరేగింపుతో ఆలయం వరకు తీసుకురావడంతో పండగ ముగుస్తుంది.
కళ్లు మిరుమిట్లు గొలిపేలా...
ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.సాయిబాబా ఆలయం నుంచి జిల్లా పరిషత్ అతిథి గృహం వరకు,మూడు రోడ్ల జంక్షన్ నుంచి సంతబయలుతో పాటు మండల కేంద్రంలోని అన్ని పురవీధుల్లోను రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ విద్యుత్ సెట్టింగులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మూడు రోడ్ల జంక్షన్, కోర్టు, రంగా సెంటర్, పాత బస్టాండుతో పాటు అమ్మవారి ఆలయం, సతకం పట్టువద్ద భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు.అదే విధంగా ఈ ఏడాది బాణసంచాను పెద్ద ఎత్తున కాల్చనున్నారు.
మూడు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మూడు చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు.జిల్లా పరిషత్ పాఠశాల,అమ్మవారి ఆలయ ప్రాంగణం,సబ్ జైలు ఎదుట ఈ స్టేజీలను సిద్ధం చేశారు.ఈ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణలో సీఐ వినోద్‌బాబు ఆధ్వర్యంలో నాలుగు వందల మందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు.
డ్రోన్ కెమెరాలతో నిఘా
చింతపల్లి: ముత్యాలమ్మతల్లి ఉత్సవాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యప్రాంతాల్లో నిఘా కెమెరాలుంటాయన్నారు. ముఖ్య కూడళ్లలో సీఐ స్థాయి అధికారితో పాటు అదనంగా బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈవ్‌టీజింగ్, చైన్‌స్నేకింగ్ తోపాటు, భక్తులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మవారి ఆలయం,సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
వాహనాలు నిలుపు ప్రాంతాలు ఇవే
జాతర నాలుగు రోజుల పాటు వాహనాలు రాకపోకలపై నిబంధనలు విధించినట్టు ఏఎస్పీ తెలిపారు.సాయంత్రం 5 గంటల నుంచి నాలుగు చక్రాలు వాహనాలను చింతపల్లి పట్టణంలోకి అనుమతి లేదన్నారు.ముఖ్యంగా నర్సీపట్నం రూటు నుంచి వచ్చే వాహనాలను ఏపీఆర్ కళాశాలవద్ద,కేడీపేట–జీకే వీధి నుంచి వచ్చే వాహనాలు జిల్లా పరిషత్ వద్ద,పాడేరు,జెర్రల నుంచి వచ్చేవి స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో నిలుపుదల చేసుకోవాలని సూచించారు.జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు , స్థానికులు పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు పాల్గొన్నారు.


