జలవనరుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం | - | Sakshi
Sakshi News home page

జలవనరుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

సాక్షి, పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు,జలవనరుల వద్ద స్నానాలకు దిగిన యువతులు, విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని,ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్‌ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా పర్యాటకులు, విద్యార్థులు గెడ్డల వద్దకు స్నానానికి వెళ్లే అవకాశం ఉందని, ఆ సమయంలో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని కాలువలు,జలపాతాలు,చెరువులు,గెడ్డలను గుర్తించి ఈనెల 17వతేదీ లోగా పాడేరు ఐటీడీఏకు నివేదిక అందజేయాలన్నారు. సరియా, చాపరాయి, రణజిల్లెడ,కొత్తపల్లి జలపాతాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.వారాంతపు రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో రెవెన్యూ,పోలీసు,అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. మద్యం సేవించి నీటిలో స్నానానికి వెళ్లే వారిని అడ్డుకునేందుకు బ్రీత్‌ ఆనలైజర్‌ తనిఖీలు చేపట్టాలన్నారు. మండలాల్లో స్థానిక ఈతగాళ్ల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని,అరకు,అనంతగిరి ప్రాంతాల్లో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు.లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులతో పాటు బారికేడ్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రమాదాలపై పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఒక్క మరణం సంభవించినా ఉపేక్షించేది లేదని,తమ ఆదేశాల అమలులో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

కలెక్టర్‌ నిశాంతి ఆదేశాలు

Advertisement
 
Advertisement
Advertisement