జాయింట్ కలెక్టర్ శ్రీపూజ
సాక్షి, పాడేరు: జిల్లాలోని అన్ని మండలాల ఎంఎల్‌ఎస్ పాయింట్లకు నిత్యావసర సరుకులను సకాలంలో చేరవేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు,ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జిలతో సరుకుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే పాఠశాలలకు,గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలకు ఎలాంటి అంతరాయం లేకుండా సరుకులను చేరవేయాలన్నారు. సరుకుల నిల్వలు, పంపిణీ వ్యవస్థకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించి, సమగ్ర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పౌరసరఫరాలశాఖ,రెవెన్యూ అధికారులు సరుకుల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని,జీసీసీ డిపోలను తనిఖీలు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


