ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని రామాలయం కాలనీ వాసుల దశాబ్దాల కల నెరవేరింది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన రహదారి లేక ఇక్కడి 40 కుటుంబాలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సమస్యతోనే సహవాసం చేస్తూ వచ్చారు. స్థానిక జెడ్పీటీసీ, విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర కాలనీ వాసుల సమస్యను గుర్తించి తక్షణమే స్పందించారు. జెడ్పీ నిధుల నుంచి రూ. 5 లక్షలు కేటాయించి, శరవేగంగా 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత మూడు రోజులుగా జరిగిన పనులు ఆదివారంతో పూర్తయ్యాయి. వర్షాకాలంలో వాహనాలను ప్రధాన రహదారిపైనే నిలిపివేసి, కాలినడకన ఇళ్లకు వెళ్లాల్సి వచ్చేదని కాలనీ వాసులు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు పూర్తి కావడంతో రాకపోకల సమస్య తీరిందని, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్రకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


