మాకవరపాలెం: లక్ష్యసాధనకు ఇష్టంతో చదవాలని ఉత్తరప్రదేశ్ మాజీ అడిషినల్ డీజీ కిల్లాడ సత్యనారాయణ అన్నారు. తామరం ఇమ్మానుయేలు ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో ఆదివారం పల్లె ప్రతిభ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల విద్యార్థులు ఎందరో ఉన్నారన్నారు. కానీ వారికి తగిన సౌకర్యాలు లేక మరుగున పడుతున్నారని, అలాంటి విద్యార్థులకు చేయూత నివ్వడం కోసమే పల్లె ప్రతిభ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఐఐటీ, నీట్, జేఈఈలో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. గతనెలలో ఈ శిక్షణకు ఎంపిక చేసేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఎంపికై న విద్యార్థుల జాబితాను వెల్లడించారు. ఈ నెల 16 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు.కార్యక్రమంలో ఇమ్మానుయేలు విద్యాసంస్థల డైరెక్టర్ జీవన్‌రాయ్, పోతల ప్రసాదనాయుడు, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోలుగుంట: పట్టణ విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏవిధంగానూ తీసిపోరని ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ అడిషనల్ డీజీ కిల్లాడ సత్యనారాయణ అన్నారు. రోలుగుంటలో వేద విద్యా డైరెక్టర్ పోతల ప్రసాద్‌నాయడు ఏర్పాటు చేసిన పల్లెల్లో ప్రగతి కేంద్రాన్ని ఆదివారం ఆయన ఐటీ కంపెనీల డైరక్టర్లతో కలసి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్యారా ఐఐటీ– నీట్‌కు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కోచింగ్‌కు సంబంధించి ఫిజిక్స్‌వాలా ప్రాజెక్ట్ డైరెక్టర్ జస్వంత్, మరో ప్రాజెక్టు డైరెక్టర్ మందుకు రావడం అభినందనీయం అన్నారు. టెస్టులో ప్రతిభ చూపిన విద్యార్థులను శాలువాతో సన్మానించి ప్రోత్సహించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ పి.రామకృష్ణారావు పాల్గొన్నారు. కొత్తకోటలో...
రావికమతం: గ్రామీణ ప్రాంత పేద విద్యార్దులకు ఉచితంగా ఐఐటి–నీట్ వంటి పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు సమర్పణ సంస్థ ఆధ్వర్యంలో వేద సంస్థ సహాయంతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐజీ కిల్లాడ సత్యనారాయణ, వేద సంస్థ అధినేత పోతల ప్రసాద్ నాయుడు తెలిపారు. కొత్తకోట సెయింట్ మెరీస్ స్కూల్‌లో ఆదివారం ఐఐటీ–నీట్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. మెదటి విడతగా రావికమతం,రోలుగుంట,మాకవరపాలెం మండలాల్లో పల్లె ప్రతిభ కేంద్రాల పేరిట ఈ శిక్షణ కేంద్రాలు ప్రారంభించామన్నారు. తమ సంస్థల ద్వారా 7,8,9 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. కొత్తకోట,దొండపూడి,తదితర పాఠశాలల్లో చదువుతున్న సుమారు 663 మంది విద్యార్థులు కొత్తకోట సెయింట్ మేరీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పరీక్షలు రాశారని, మొదటి విడతగా 25 మందిని ర్యాంకుల ద్వారా ఎంపిక చేస్తామని,వారికి మూడు వేల రూపాయలు విలువైన బుక్స్ అందజేసి, శిక్షణ అందిస్తామని తెలిపారు.


