15వ అంతస్తు నుంచి జారిపడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

15వ అంతస్తు నుంచి జారిపడి యువకుడి మృతి

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

గాజువాక: స్థానిక సెలెస్ట్‌ గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌లోని ఒక భవనం 15వ అంతస్తు నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. గాజువాక పోలీసుల కథనం ప్రకారం.. చింతపల్లికి చెందిన వంతల పూర్ణనాగ తేజ (33) హైదరాబాద్‌లో అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్నాడు. చింతపల్లిలో పండగకు రావాలని అతడి తండ్రి పిలవడంతో స్నేహితులతో కలిసి శుక్రవారం వందే భారత్‌ రైలులో విశాఖపట్నం వచ్చాడు. రాత్రి పొద్దుపోవడంతో గాజువాకలోని సెలెస్ట్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న తన సోదరుడు ఆదిత్య ఫ్లాట్‌కి వచ్చాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. అయితే, గ్రిల్స్‌ లేని కిటికీలో నుంచి కిందకి చూస్తూ పడిపోయినట్టు అతడి సహచరులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. నాగతేజ తన భార్యతో కలిసి ఇక్కడికి రావాల్సి ఉందని, ఆమెకు సెలవు లభించకపోవడంతో స్నేహితులతో కలిసి వచ్చాడని పోలీసులు తెలిపారు. కేసును ఎస్‌ఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement