గిరి ప్రజల సేవలో నవ దంపతులు | - | Sakshi
Sakshi News home page

గిరి ప్రజల సేవలో నవ దంపతులు

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

జేసీగా తిరుమణి శ్రీపూజ,

ఐటీడీఏ పీవోగా

ఆదిత్యవర్మ బాధ్యతల స్వీకరణ

సాక్షి.పాడేరు: జాయింట్‌ కలెక్టర్‌గా తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవోగా ఆదిత్యవర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్రీపూజ, ఆదిత్యవర్మ గత నెలలో ఢిల్లీలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుమణి శ్రీపూజ పాడేరు ఐటీడీఏ పీవోతో పాటు ఇన్‌చార్జి జేసీగా పనిచేస్తున్నారు. ఆమెను ప్రభుత్వం పాడేరు జేసీగా పదోన్నతిపై ఇటీవల నియమించింది. అస్సాంలో పనిచేస్తున్న ఆదిత్యవర్మ ఆ రాష్ట్రం నుంచి రిలీవ్‌ అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పాడేరు ఐటీడీఏ పీవోగా నియమించింది.

మోదకొండమ్మతల్లికి పూజలు

ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ దంపతులు శనివారం పాడేరు మోదకొండమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. మోదకొండమ్మతల్లి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేశారు.

జిల్లా అభివృద్ధికి కృషి: జాయింట్‌ కలెక్టర్‌

తిరుమణి శ్రీపూజ

జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆమె జేసీగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీఆర్వో నీలకంఠరావుతో పాటు పలు శాఖల అధికారులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పీవోగా ఇన్‌చార్జి జేసీగా పనిచేసిన అనుభవంతో జేసీగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

గిరిజనాభివృద్ధికి కృషి:

ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం గొప్పవరమని, అందరి సహకారంతో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ తెలిపారు. ఐటీడీఏ పీవోగా శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏవో హేమలత, అన్ని విభాగాల అధికారులు పీవోకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్య,వైద్యం లక్ష్యంగా పనిచేస్తానన్నారు.గిరిజన యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల మెరుగుకు ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పీవో పేర్కొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న తిరుమణి శ్రీపూజ,

ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆదిత్యవర్మ

Advertisement
 
Advertisement
Advertisement