● 400 మంది పోలీసులతో పహారా
● చింతపల్లి సీఐ వినోద్‌బాబు
చింతపల్లి: స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ వినోద్‌బాబు తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లాలో పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల తర్వాత అంతటి స్థాయిలో జరిగే ముత్యాలమ్మ జాతరకు సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాతర సమయంలో చింతపల్లి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. భక్తుల వాహనాల కోసం అంతర్ల, ఏపీఆర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రాంగణాలను పార్కింగ్ స్థలాలుగా కేటాయించామని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులతో సమన్వయం కావాలని కోరారు. కమిటీ సూచనల మేరకు అవసరమైన అన్ని ప్రాంతాలలో సిబ్బందిని మోహరిస్తామన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి ముత్యాలమ్మ ఆలయం, స్టేజీల ఏర్పాటు, అమ్మవారి సతకం పట్టు, గరగలు తీసే ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పసుపులేటి వినాయరావు, పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బేతాళుడు, ఎస్‌ఐలు వీరబాబు, వెంకటరమణ, కమిటీ సభ్యులు వీరేంద్ర, రమణ, శ్రీను, దారబాబు తదితరులు పాల్గొన్నారు.


