ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. రవాణా కష్టాలతో అల్లాడుతున్న ఏవోబీ వాసుల కోసం జోలాపుట్టు వద్ద నూతన వంతెన నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల మళ్లింపు వంటి ఆటంకాలను దాటుకుని, ఒడిశా ప్రభుత్వ చొరవతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.
పట్టాలెక్కిన అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం
వంతెన కోసంఎన్నోసార్లు ఆందోళన
జోలాపుట్టు వంతెన కోసం అనేక సార్లు ఆందోళనలు చేశాం. ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు, అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లాం. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం సరిహద్దు వంతెనకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం. వేగంగా వంతెన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తే ప్రయాణ కష్టాలు తీరుతాయి.
– వి.మణి, జోలాపుట్టు, ముంచంగిపుట్టు మండలం
అవస్థలు తప్పుతాయి
జోలాపుట్టు వద్ద వంతెన పనులు చకచకా జరుగుతూ ఉండడంతో చాలా ఆనందంగా ఉంది. ద్విచక్రవాహనదాలు ఐరెన్ వంతెన మీదుగా, కార్లు, ఆటోలు, జీపులు జోలాపుట్టు జలాశయం డ్యామ్ మీదుగా మూడు కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. వంతెన పూర్తి చేస్తే రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది.
– పి.హరినాథ్, బిల్లాపుట్టు, ఒడిశా
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని జోలాపుట్టు వద్ద నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిహద్దులో సరైన వంతెన సౌకర్యం లేక గత కొన్ని దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం చొరవతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
రూ. 10 కోట్లు మంజూరు చేసిన ఒడిశా..
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణంపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో, సరిహద్దు ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించిన ఒడిశా ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దీంతో గత మూడు నెలలుగా వంతెన నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని వందలాది గ్రామాలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.
ఇబ్బందులు.. పరిమిత రాకపోకలు
ప్రస్తుతం జోలాపుట్టు సరిహద్దు ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐరన్ వంతెనపై కేవలం కాలినడకన లేదా ద్విచక్ర వాహనాలపై మాత్రమే ప్రయాణిస్తున్నారు. కార్లు, జీపులు, బొలెరో వంటి వాహనాలు పాత జలాశయం వంతెనపై నుంచి అతి కష్టం మీద వెళ్తున్నాయి. అయితే బస్సులు, లారీలు, వ్యాన్ల వంటి భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో నిత్యావసరాల రవాణాకు, అత్యవసర ప్రయాణాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పదేళ్ల నిరీక్షణ..: నిజానికి ఈ వంతెన నిర్మాణం కోసం 2014లోనే అప్పటి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి (అరకు మాజీ ఎంపీ) కిశోర్ చంద్రదేవ్ తన ఎంపీ నిధుల నుంచి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైనప్పటికీ, పునాదుల దశలోనే నిలిచిపోయాయి. కాలయాపన కారణంగా ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. తమ గోడును పట్టించుకోవాలని సరిహద్దు ప్రజలు ఏళ్ల తరబడి ఇటు ఆంధ్ర, అటు ఒడిశా ప్రభుత్వాలకు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూనే ఉన్నారు. అనేకసార్లు జోలాపుట్టు జలాశయం గేట్లు మూసివేసి ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు చేశారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి బంద్‌లు నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
హర్షం వ్యక్తం చేస్తున్న సరిహద్దు ప్రజలు
ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో ఏవోబీ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి, పనులను మరింత వేగవంతం చేసి వంతెనను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఈ వంతెన పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి.
రూ.10 కోట్లు మంజూరు చేసిన
ఒడిశా ప్రభుత్వం
యుద్ధప్రాతిపదికన జోలాపుట్టు బ్రిడ్జి పనులు
పదేళ్ల నిరీక్షణకు తెర..
ఏవోబీ సరిహద్దు ప్రజల కష్టాలకు
శాశ్వత పరిష్కారం


