పిల్లల కదలికలపై నిఘా అవసరం | - | Sakshi
Sakshi News home page

పిల్లల కదలికలపై నిఘా అవసరం

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

పంపిణీ

అరకులోయ టౌన్‌: పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచడం ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. హుకుంపేట మండలం, బూర్జ పంచాయతీ జంబవలస గ్రామ సమీపంలోని మూలగుమ్మి జలపాతంలో ఈతకు వెళ్లి మృతి చెందిన బాలికల కుటుంబాలను శుక్రవారం ఉదయం ఆయన అరకులోయ ఏరియా ఆస్పత్రిలో పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతి చెందిన ముగ్గురు బాలికల కుటుంబాలకు తన వంతుగా రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 15 వేల నగదును అందజేశారు. అలాగే రెవెన్యూ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. బాలికల మృతికి సంబంధించిన వివరాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి సెలవులకు ఇంటికి వచ్చే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి విషాద సంఘటనలు జరగకుండా ఉండాలంటే, పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వారు వాగులు, గెడ్డల వద్దకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాము, ఎస్‌ఐ గోపాలరావులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌ కుమార్‌, పార్టీ మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement