పెట్రోల్‌ బంకుల్లో తేడాలొస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో తేడాలొస్తే కఠిన చర్యలు

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

జీసీసీ డీజీఎం సూర్యనారాయణ

చింతపల్లి: పెట్రోల్‌ బంకుల నిర్వహణలో ఏమాత్రం తేడాలు వచ్చినా కఠిన చర్యలు తప్పవని జీసీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పి.సూర్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన స్థానిక జీసీసీ బ్రాంచ్‌ పరిధిలోని గ్యాస్‌ గోడౌన్‌ నిల్వలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా అవుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక జీసీసీ పెట్రోల్‌ బంకును సందర్శించి రికార్డులను, నిల్వలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్‌ బంకుల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. చింతపల్లి బంకులో ప్రతిరోజూ రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు పెట్రోల్‌ అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును మరుసటి రోజే బ్యాంకులో జమ చేయాలని ఆదేశించారు. నిధుల జమలో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి బంకులోనూ 0.6 శాతం మేర ‘ఎవాపరేషన్‌’ (పెట్రోల్‌ ఆవిరి కావడం వల్ల వచ్చే వ్యత్యాసం) సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ నిల్వల ఎవాపరేషన్‌ శాతంలో మార్పులు ఉంటాయన్నారు. గూడెంకొత్తవీధి బంకులో రూ. 20 లక్షల నిధులు ఫ్రీజ్‌ (నిలిచిపోవడం) కావడం వల్ల కొంతకాలం బంకు మూతపడిందని, ప్రస్తుతం అక్కడ అవసరమైన నిల్వలను పంపిణీ చేసి పునరుద్ధరించామని వెల్లడించారు. బంకుల్లో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది వినియోగదారుల పట్ల వినయంగా ప్రవర్తించాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే వారిని విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకటేశ్వరరావు, బ్రాంచ్‌ మేనేజర్‌ ఎస్‌. సుగునాథం, బంక్‌ ఇన్‌చార్జ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement