కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

పాడేరు రూరల్‌: పంచాయతీ కార్మికులు, ఐటీడీఏ అంబులెన్స్‌ డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఐటీడీఏ ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమర్‌, జల్లి రాజుబాబు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్మికులు, అంబులెన్స్‌ డ్రైవర్లు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం వారి చేత గొడ్డు చాకిరీ చేయిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారాన్ని మోయలేకపోతున్నారని తెలిపారు. పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, వాటర్‌ సప్లై, ఎలక్ట్రికల్‌, స్వచ్ఛ భారత్‌ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని నేతలు ఆరోపించారు. కార్మికుల వేతన బకాయిలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని గతంలో కలెక్టర్‌ ఆదేశించినప్పటికీ, అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు.

జీవో నంబరు 680 అమలు చేయాలి

కార్మిక సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం వేతనాలను రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ జారీ చేసిన జీవో నంబరు 680 ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కార్మికులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. 108 అంబులెన్స్‌ డ్రైవర్ల తరహాలోనే ఐటీడీఏ అంబులెన్స్‌ డ్రైవర్లకు రూ. 28,500 వేతనం చెల్లించాలని, కార్మిక హక్కులు, చట్టాలను 100 శాతం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను తక్షణమే పరిష్కరింలచాలన్నారు. లేకుంటే భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జీవన్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, రాజు, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ ముఖద్వారం వద్ద

ఏఐటీయూసీ ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement