● ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి
చింతపల్లి: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం, స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నెల 13న వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉన్నత పర్వత శ్రేణి పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతాలకు చెందిన రైతులతో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. గిరిజన రైతుల జీవనోపాధి పెంపుదల, వాతావరణానికి అనువైన వంగడాలు, కొత్త పంటల సరళి, మరియు సేంద్రియ వ్యవసాయ మెళకువలపై చర్చ జరుగుతుందన్నారు.ఈ ఏడాది పంటలపై ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరిస్తామని తెలిపారు.శాస్త్రవేత్తలు రూపొందించిన పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయడమే ఈ సమావేశ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామీణ యువత, మహిళలకు వృత్తిపరమైన శిక్షణతో పాటు, వ్యవసాయ విస్తరణ సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి దిగుబడులు పెంచే మార్గాలను చర్చిస్తారన్నారు. పరిశోధనా సంచాలకుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వరి, మొక్కజొన్న, అపరాలు, నూనెగింజలు, చెరకు వంటి పంటల ప్రధాన శాస్త్రవేత్తలు హాజరవుతారని ఏడీఆర్ తెలిపారు.


