● ఆకట్టుకుంటున్న గిరిజన సంప్రదాయం
ముంచంగిపుట్టు: మన్యంలోని గిరిజన గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి మొదలైంది. తమ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గిరిజనులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కించాయిపుట్టు పంచాయతీ దారపల్లి గ్రామంలో జరుగుతున్న వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ పండుగలో భాగంగా చిన్నారుల శరీరం అంతా మామిడి ఆకులతో కట్టి, నుదుట బొట్టు పెట్టి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వీరికి ప్రత్యేక పూజలు చేయించి, పల్లకలో వైభవంగా ఊరేగించారు. తరతరాలుగా వస్తున్న పూర్వీకుల పద్ధతులను నేటికీ తూచా తప్పకుండా పాటిస్తూ గిరిజనులు తమ ఆచారాలపై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటున్నారు.


