వానొస్తే బురద.. ఎండ కాస్తే ధూళి | - | Sakshi
Sakshi News home page

వానొస్తే బురద.. ఎండ కాస్తే ధూళి

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

● బీఎన్‌ రోడ్డులో ప్రయాణికుల అవస్థలు ● 3 జిల్లాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ● పట్టించుకోని కూటమి పాలకులు, అధికారులు

బుచ్చెయ్యపేట: ఎండ కాస్తే దుమ్ము, ధూళి లేచిపోయి కళ్ల మంటలతో ప్రయాణం.. వానొస్తే గోతుల్లో చేరిన వర్షం నీరు, బురదతో ఇబ్బందులు. ఇది భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్‌) రోడ్డులో ప్రయాణికులు పడుతున్న నిత్య కష్టాలు.. బీఎన్‌ రోడ్డులో మరలా బురద కష్టాలు ప్రయాణికులకు ఎదురయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వాహనదారులకు కీలకమైన ప్రధాన రహదారి అభివృద్ధిపై పాలకులు, అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన బీఎన్‌ రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారుడు నత్తనడకన చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోతులుగా ఉన్న బీఎన్‌ రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు చేరి బురదమయంగా మారింది. ఎండ కాస్తే రాయి బుగ్గి లేచిపోయి వాహనదారులతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితుల వారు అవస్థలు పడుతున్నారు. ఎండలో రాకపోకలు సాగించేటప్పుడు వాహనదారుల దుమ్ము పడి కళ్ల మంటలతో తీవ్ర నరకం అనుభవిస్తున్నారు.

గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే

అభివృద్ధికి చర్యలు

గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే బీఎన్‌ రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అప్పటి ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా బీఎన్‌ రోడ్డు విస్తరణకు రూ. 87 కోట్లు మంజూరు చేయించారు. ఐదేళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టిన గుత్తేదారుడు నత్తనడకన పనులు సాగిస్తున్నాడు. గోతులు వల్ల పలు ప్రమాదాలు జరిగి వాహనాలు రోడ్డు గోతుల్లో కూరుకుపోయి జేసీబీలతో లాగిన బీఎన్‌ రోడ్డు పనులపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు.

కూటమి నేతల హామీ ఏమైంది?

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీఎన్‌ రోడ్డును బాగు చేయలేకపోయారు, రవాణా సౌకర్యం కల్పించలేకపోయారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా బీఎన్‌ రోడ్డును బాగు చేస్తామన్న కూటమి నేతల హామీ రెండేళ్లయినా నెరవేరలేదు. బీఎన్‌ రోడ్డు దుస్థితిని చూసి చోడవరం న్యాయవాదులు రోడ్డు మరమ్మతులు చేయకపోవడంపై కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు కేసుతో అధికారులు, గుత్తేదారులు నాలుగు నెలల క్రితం ప్రారంభించిన నత్తనడకన సాగిస్తున్నారు. రోలుగుంట మండలం నుంచి రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు పెద్ద పెద్ద గోతులు పడి రవాణాకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

కానరాని కొత్త వంతెనలు

విజయరామరాజుపేటలో తాచేరు, వడ్డాదిలో పెద్దేరు వంతెనలు కూలిపోగా, వీటి స్థానంలో కొత్తవి నిర్మాణ పనులు జరగలేదు. వడ్డాది, విజయరామరాజుపేటలో తాత్కలికంగా వేసిన డైవర్షన్‌ రోడ్లు వర్షాలు ఎక్కువైతే మరలా కొట్టుకుపోయేలా ఉన్నాయి. బీఎన్‌ రోడ్డులో అసంపూర్తి పనులు వల్ల వర్షాలు ఎక్కువైతే గోతుల్లో నీరు చేరి బురదలో వాహనాలు కూరుకుపోయి జేసీబీలతో లాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు బీఎన్‌ రోడ్డు పనులుపై దృష్టి సారించి రవాణా కష్టాలు తీర్చాలని మూడు జిల్లాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement