కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారంతో పాటు,జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులు,సిబ్బందితో సమావేశం నిర్వహించారు.గత 22నెలల కాలంలో పరిష్కరించిన రెవెన్యూ సమస్యలు,పెండింగ్‌లో ఉన్న పనులు తదితర 25 ఆంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రెవెన్యూ అధికారులంతా మండల స్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించాలన్నారు. మండల, గ్రామ కార్యాలయాల్లో ప్రభుత్వ, అటవీ, జిరాయతీ భూముల సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. న్యాయస్థానాల ద్వారా వచ్చే ఆదేశాలను కూడా తప్పకుండా పాటించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీకి సంబంధించి గ్రామస్థాయిలో కులం వివరాలపై సమగ్ర విచారణ చేయాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని, నూతన గృహ లబ్ధిదారులకు పట్టాలు అందించేందుకు లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఇన్‌చార్జి డీఆర్వో నీలకంఠరావు, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


