లబ్బూరు ఏకలవ్య విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిక
ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ, లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, విద్యార్థుల కష్టాలను తీర్చాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మంగళవారం లబ్బూరు ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా పాఠశాలలో సమస్యల కారణంగా తమ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయమై అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన లేదని, అధికారులు కేవలం హామీలతో కాలయాపన చేస్తున్నారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని, సమస్యలతోనే తమ పిల్లలు సహవాసం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, ఈ నెల 11వ తేదీన తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్లిపోతామని వారు హెచ్చరించారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చి చూస్తామని, అప్పటికి కూడా సమస్యలు అలాగే ఉంటే తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రామదాసు, తల్లిదండ్రులు రోథోన్, నర్సింగ్, పరశురామ్, శ్రీనివాసరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


