వింత వ్యాధి కలకలం | - | Sakshi
Sakshi News home page

వింత వ్యాధి కలకలం

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

పెదబయలు: మండలంలోని బొంగరం పంచాయతీ మొట్టలగుమ్మి గ్రామంలో వింత వ్యాధి సోకి ఆరు దుక్కిటెద్దులు మృత్యువాత పడ్డాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుటారి లక్ష్మయ్యకు చెందిన రెండు ఎద్దులు, తల్లె లక్ష్మీపతికి చెందిన ఒకటి, తల్లె చిన్నయ్యకు చెందిన ఒకటి, కె. బుజ్జిబాబుకు చెందిన ఒక ఎద్దుతో పాటు మొత్తం ఆరు పశువులు మరణించాయి. పశువుల నోటి నుంచి నురగ రావడం, గుర్రు పెట్టడం, ఊపిరి అందక నాలుక బయటకు చాచి మృతి చెందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని మిగిలిన పశువులకు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. మృతి చెందిన ఒక్కో ఎద్దు విలువ సుమారు రూ. 25 వేల వరకు ఉంటుందని, పెట్టుబడి పోయి తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. గత నెలలో ఇంజరి పంచాయతీలో కూడా ఇలాగే పశువులు మృతి చెందాయని, ఇప్పుడు బొంగరం పంచాయతీలో వ్యాధి ప్రబలుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించాలని అత్యవసరంగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నష్టపోయిన పాడి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు.

ఆరు దుక్కిటెద్దుల మృతి

Advertisement
 
Advertisement
Advertisement