పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్‌గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు.


