ఈపీడీసీఎల్‌లో వినూత్న కార్యక్రమం
డయల్ యువర్ సీఎండీకి వినతుల వెల్లువ
ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు
వచ్చిన ప్రతి సమస్యపైనా దృష్టిసారిస్తున్న సీఎండీ పృథ్వీతేజ్
దూకుడుగా వ్యవహరిస్తున్న ఈపీడీసీఎల్ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
345 ఫిర్యాదులు.. 35 పెండింగ్
ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్‌యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్‌లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం.
మిస్డ్ కాల్స్‌పైనా దృష్టి పెడుతున్నాం..
ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు.
–పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ
దెబ్బలపాడు గ్రామస్తులతో ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది


