కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా? | - | Sakshi
Sakshi News home page

కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

రాగుల సరఫరా మూన్నాళ్ల ముచ్చటే..

రేషన్‌లో కనిపించని కందిపప్పు

కార్డుదారుల నిరీక్షణకు అంతం ఎప్పుడో?

పెరిగిన ధరలతో సామాన్యుడి నిట్టూర్పు

మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్‌ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్‌ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

పిండితో సరిపెడుతున్న సర్కార్‌

బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్‌, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది.

జిల్లాలో పరిస్థితి ఇలా...

డీఎస్‌ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే..

గడప గడపకు రేషన్‌ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్‌ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్‌ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రాగులు మున్నాళ్ల ముచ్చటే..

రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్‌ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.

రేషన్‌ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్‌పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది.

కందిపప్పు కోసం కళ్లప్పగింత

గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్‌లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్‌ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్‌లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్‌ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement