చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగ నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు అల్లూరి జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను వెల్లడించారు. డివిజన్‌ల పరిధిలో వర్షపాతం 0.2 నుంచి 6.0 మిల్లీ మీటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీలు నుంచి 32.9 డిగ్రీలు మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 16.9 డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 77 నుంచి 82 శాతం మధ్యాహ్న సమయాల్లో 50 నుంచి 75 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు ఆరు కిలోమీటర్లు వేగంతో వీచే సూచనలు ఉన్నట్టు తెలిపారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు పంటలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ తెలిపారు.


