పీజీఆర్‌ఎస్–167, రెవెన్యూ క్లినిక్‌కు 181 అర్జీలు
తుమ్మపాల : పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఅర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిల్లోనే సమస్యలను పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని దరఖాస్తులపై కారణాలు అర్జీదారులకు వివరంగా తెలియజేయాలన్నారు. పీజీఅర్‌ఎస్‌కు 167, రెవిన్యూ క్లినిక్‌లో 181 మొత్తం 348 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి...పలు అర్జీదారుల ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి...
మైనింగ్ అధికారులపై ఫిర్యాదు
చింతలూరు సర్వే నెం.379–1 లో గ్రాంట్ ఆర్డర్ లేకుండా జరిగిన 3వేల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్‌పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం, చింతలూరు గ్రామానికి చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్‌ఫోర్స్ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద బీజేపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు.


