కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు | - | Sakshi
Sakshi News home page

కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

తుమ్మపాల : కౌమార దశలో (చిన్న వయసులో) గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతుండడం విచారకరమని, దీనివల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారని అన్నారు. లైంగిక అవగాహన లోపం, బాల్య వివాహాలు, పేదరికం, సరైన తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తొలి వార్షికోత్సవం కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో పీ4 వార్షికోత్సవాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టరేట్‌లో ఆమెతో పాటు జేసీ, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement