మైనింగ్ సిబ్బందితో గ్రామస్తుల వాగ్వాదం
రావికమతం : గ్రావెల్, రాయి ఏదైనా తెచ్చుకోవాలంటే మైనింగ్ సిబ్బందికి డబ్బులు కట్టాల్సిందే.. లేదంటే కుదరదంటున్నారు మైనింగ్ సిబ్బంది. మండలంలో గర్నికంలో ఇంటి నిర్మాణానికి రాయి పిక్కలను తీసుకొస్తుండగా ఏఎంఆర్ సంస్థ మైనింగ్ సిబ్బంది అడ్డుకోవడంపై మహిళలు తిరగబడ్టారు. కొండ ప్రాంతంలో రాయి పిక్కలు ఏరుకొని తీసుకొస్తుండగా టాక్స్ కట్టమనడం ఎంత వరకు సమంజసం.. అంటూ మైనింగ్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం గర్నికం గ్రామస్తులు, సర్పంచ్ భర్త నూకరాజు ిమైనింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెంధిన కొందరు మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గచ్చులు చేయడానికి రాయి పిక్క అవసరం కావడంతో సమీపంలో గల మెట్ట ప్రాంతంలో చిన్న రాయి పిక్కలను పోగుచేసుకొని వాటిని ట్రాక్టర్‌లో వేసి తీసుకెళుతుండగా ఏఎంఆర్ మైనింగ్ సంస్థ సిబ్బంది టాక్స్ కట్టాలని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇస్తుంటే , రాయి పిక్కలకు ట్యాక్స్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ భర్త నూకరాజు తదితరులు అక్కడికి చేరుకొని మైనింగ్ సంస్థను తప్పు బట్టారు. రాయి పిక్కలకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉందా , ఉంటే అందుకు సంబంధించిన జీవో చూపించాలని నిలదీశారు. ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే సామాన్యులు ఎలా బతకాలి... అని కూటమి ప్రభుత్వం సంపద సృష్టించడం అంటే ఇదేనా? అంటూ మహిళలు వాపోయారు.


